సార్వత్రిక ఎన్నికల సమరంలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భారీగా పుంజుకుంది. మరోపక్క, ఎన్డీయే 400 సీట్లు, బీజేపీ సొంతంగా 370 సీట్ల లక్ష్యాలు తునాతుకలయ్యాయి. గత రెండు ఎన్నికల్లోనూ సొంతంగా మెజారిటీ మార్కు (272)ను అధిగమించిన కమలనాథులకు ఓటర్లు షాకిచ్చారు. దీంతో బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. కాషాయ పార్టీకి కంచుకోటల్లాంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి హిందీ రాష్ట్రాల్లో కమలానికి ఘోర పరాభవం ఎదురైంది. అయితే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మెరుగైన ప్రదర్శనతో ఆ నష్టం కొంతమేర పూడ్చుకుంది. కాంగ్రెస్ సొంతంగా సెంచరీ కొట్టగా, ఎస్పీ 37 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
